: కేంద్రమంత్రి మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు.. కురచ దుస్తులు ధరించొద్దని విదేశీ మహిళా టూరిస్టులకు సూచన


కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖామంత్రి మహేశ్ శర్మ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి వచ్చే విదేశీ మహిళా టూరిస్టులు కురచ దుస్తులు, స్కర్టులు ధరించవద్దని సూచించారు. ఆదివారం ఆయన ఆగ్రాలోని తాజ్ సిటీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘స్వీయ రక్షణ కోసం విదేశీ మహిళా టూరిస్టులు స్కర్టులు, పొట్టి దుస్తులు ధరించకుంటే మంచిది. పాశ్చాత్య సంస్కృతితో పోలిస్తే భారత్ సంస్కృతి భిన్నమైనది’’ అని పేర్కొన్నారు. అలాగే రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లవద్దని సూచించారు. మధుర, బృందావన్ తదితర ఆధ్యాత్మిక పట్టణాలు సందర్శించేటప్పుడు అక్కడి సంస్కృతిని గుర్తుపెట్టుకుని మెలగాలని కోరారు. మంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. విదేశీ మహిళలు ఎటువంటి దుస్తులు ధరించాలో మంత్రి నిర్ణయించజాలరంటూ విపక్షాలు ఆయనపై విరుచుకుపడ్డాయి. విమర్శల జడివానపై స్పందించిన మంత్రి మహేశ్ మాట్లాడుతూ విదేశీ మహిళలు ఎటువంటి దుస్తులు ధరించాలన్న దానిపై తామేమీ నిబంధనలు విధించడం లేదని పేర్కొన్నారు. ‘‘వారు ఎటువంటి దుస్తులు ధరించాలనేది వారిష్టం. అయితే రాత్రుళ్లు ఒంటరిగా బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండమనే సూచిస్తున్నాం. వారి ఇష్టాయిష్టాలను మార్చుకోమని మేం చెప్పడం లేదు’’ అని వివరించారు. కాగా శర్మ గతంలోనూ మహిళల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు నైట్ అవుట్ చేయడం భారత సంస్కృతీ సంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొంటూ అప్పట్లో వివాదానికి తెరలేపారు.

  • Loading...

More Telugu News