: భాగ్యనగరిలో ముద్రగడ!... నేడు దాసరి, చిరులతో కాపు నేత కీలక భేటీ!
కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిన్న రాత్రికి హైదరాబాదు చేరుకున్నారు. ఏపీలో కాపులకు రిజర్వేషన్లపై చంద్రబాబు సర్కారు నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని ఆరోపిస్తున్న ముద్రగడ... మరోమారు ఉద్యమ బాట పట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆయన ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నెలాఖరు నాటికి కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని తేల్చాలని డెడ్ లైన్ విధించిన ముద్రగడ... అలా జరగని పక్షంలో ఉద్యమం తప్పదని చెప్పారు. ఈ క్రమంలో కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు... దాసరి నారాయణ రావు, చిరంజీవిలతో భేటీ కోసమే ముద్రగడ హైదరాబాదు వచ్చారు. నిన్న రాత్రికే హైదరాబాదు చేరుకున్న ఆయన నేడు దాసరి, చిరులతో భేటీ కానున్నారు.