: గుంటూరు జిల్లాలో హైటెన్షన్!... బహిరంగ చర్చకు యరపతినేని, పిన్నెల్లి సిద్ధం!


గుంటూరు జిల్లాలో నేటి ఉదయం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లాలోని మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో పోలీసులు 144 సెక్షన్ ఆంక్షలు విధించారు. ఇప్పటికే మాచర్ల, గురజాలల్లో భారీగా మోహరించిన పోలీసు బలగాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మాచర్లలో స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (వైసీపీ)ని ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు... 200 మంది సాయుధ బలగాలను రంగంలోకి దించారు. ఇక టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గురజాలలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. అయినా ఈ రెండు నియోజకవర్గాల్లోనే హైటెన్షన్ వాతావరణం ఎందుకంటే... పుష్కరాల్లో అవినీతి జరిగిందంటూ పిన్నెల్లి, జరగలేదంటూ యరపతినేని సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ పిన్నెల్లి విసిరిన సవాల్ కు యరపతినేని సై అన్నారు. నేడు (29వ తేదీన) నడికుడి మార్కెట్ యార్డులో చర్చకు రావాలంటూ పిన్నెల్లికి యరపతినేని సవాల్ విసిరారు. దీనికి పిన్నెల్లి కూడా సై అన్నారు. ఈ క్రమంలో ఇరువురు నేతలు నేడు నడికుడి మార్కెట్ యార్డుకు వెళ్లేందుకు సిద్ధపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను నిలువరించేందుకు రంగంలోకి దిగారు. బహిరంగ చర్చలకు దూరంగా ఉండాలని వారు ఇరువురు నేతలకు చెబుతున్నారు. ఈ కారణంగానే ఆ రెండు నియోజకవర్గాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News