: హెచ్‌డీఎఫ్‌సీలో ‘రోబో’.. మారనున్న సేవల స్వరూపం!


దేశంలోని ప్రైవేటు బ్యాంకుల్లో రెండో అతిపెద్ద సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ తన సేవల స్వరూపాన్ని మార్చబోతోంది. వినియోగదారులకు వింతైన అనుభవాన్ని ఇవ్వనుంది. మరికొన్ని వారాల్లో ఆ సంస్థ బ్రాంచిల్లో రోబోలు సందడి చేయనున్నాయి. వినియోగదారులకు సేవలు అందించనున్నాయి. ఇప్పటికే ఈ తరహా సేవలను జపాన్‌లోని టోక్యో-మిత్సుబిషి బ్యాంకు అందిస్తుండగా ఇప్పుడు అదే కోవలోకి హెచ్‌డీఎఫ్‌సీ చేరింది. టోక్యో-మిత్సుబిషి బ్యాంకు గతేడాదే ఈ సేవలు ప్రారంభించింది. త్వరలోనే ‘ప్రాజెక్ట్ ఏఐ’(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పేరుతో పైలట్ ప్రాజెక్టు కింద రోబో సేవలను అందించేందుకు హెచ్‌డీఎఫ్‌సీ కార్యాచరణ సిద్ధం చేసింది. రోబో పేరును కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. తొలుత ముంబైలో రోబో సేవలను అందించాలని నిర్ణయించినట్టు సమాచారం. బ్యాంకులోకి అడుగుపెట్టే వినియోగదారులకు కావాల్సిన సేవలను ఈ రోబో అందించనుంది. అయితే దీని ద్వారా తొలుత పరిమిత సేవలే అందనున్నాయి. అంటే రిసెప్షనిస్ట్ కంటే ఎక్కువ, అధికారి కంటే తక్కువ అన్నమాట. బ్యాంకులోకి అడుగిడే వినియోగదారుడికి సేవల కోసం నగదు డ్రా, డిపాజిట్, ఫారెక్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్, డీమ్యాట్ సేవలు... ఇలా కొన్నింటిని ఈ రోబో డిస్ప్లే చేస్తుంది. వినియోగదారుడు తనకు కావాల్సిన సేవలను వాటిపై తాకడం ద్వారా అందుకోవచ్చని బ్యాంకు అధికారులు తెలిపారు. అయితే విస్తృత సేవలను మాత్రం ఇవి అందించలేవని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News