: పవన్ ఏదేదో మాట్లాడుతున్నారు... ఎంపీ పదవి నాకు వెంట్రుకతో సమానం: జేసీ దివాకర్ రెడ్డి
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏదేదో మాట్లాడుతున్నారని... ఎంపీ పదవి తనకు వెంట్రుకతో సమానమని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నోరు వుందని పవన్ కల్యాణ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అసలు పవన్ కల్యాణ్ రోడ్డెక్కాల్సిన అవసరమేముందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్ ప్రాక్టికల్ గా మాట్లాడాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై పవన్ కల్యాణ్ వెనుక నడిచేందుకు తాము సిద్ధమని, హోదా కోసం తాము ఏం చేసేందుకైనా సిద్ధమేనని అన్నారు. ఆరు కోట్ల మంది అడ్డుకున్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టిందని, ఇవాళ ఉన్నవి చెవిటి, మూగ ప్రభుత్వాలని పవన్ కల్యాణ్ కు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజాభిప్రాయంపై గౌరవంలేని ప్రభుత్వాలివని, ఏం చేసుకుంటారో చేసుకోండని అంటున్నాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ఎంపీలందరూ రాజీనామా చేసినా ప్రయోజనముండదన్నారు. తాము వ్యాపారులం కాబట్టే పది రూపాయలు ఖర్చు చేసి గెలుస్తున్నామని జేసీ పేర్కొన్నారు.