: అనంత, చిత్తూరు జిల్లాలకు చంద్రబాబు వరం!... సాగుకు 24 గంటల కరెంటిస్తామని ప్రకటన!
రాయలసీమలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో సతమతమవుతున్న అనంతపురం, చిత్తూరు జిల్లాల రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఓ వరాన్ని ప్రసాదించారు. నేటి ఉదయం విజయవాడ నుంచి బయలుదేరిన చంద్రబాబు... అనంతపురం జిల్లా పుట్టపర్తి చేరుకున్నారు. ఆ జిల్లాలో నీటి లభ్యత లేకుండా ఎండిపోతున్న వేరుశనగ పంటను పరిశీలించిన ఆయన చలించిపోయారు. మరికొన్ని రోజుల్లో చేతికందుతుందన్న పంట కళ్లెదుటే ఎండిపోతున్న వైనంపై రైతుల ఆవేదన ఆయనను కదలించింది. ఈ నేపథ్యంలో అక్కడికక్కడే ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్న అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ను అందజేస్తామని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఇప్పటికే అందుబాటులో ఉన్న రెయిన్ గన్లతో పాటు మహారాష్ట్ర నుంచి మరిన్ని అదనపు రెయిన్ గన్లు తెప్పించి పంటలను సంరక్షిస్తామని చెప్పారు. కరవు మండలాల్లో ఎమర్జెన్సీ ప్రకటిస్తామని చెప్పిన చంద్రబాబు... కరవులో చిక్కుకున్న ఒక్కో నియోజకవర్గానికి ఓ ఐఏఎస్ అధికారిని... రెండు, మూడు మండలాలకు ఓ గ్రూప్-1 స్థాయి అధికారిని నియమిస్తామని పేర్కొన్నారు.