: హద్దులు దాటే అభిమానులు నాకొద్దు!... అభిమానంపై జూనియర్ ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు!
సినీ హారోలపై జనం చూపిస్తున్న అభిమానంపై టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కొద్దిసేపటి క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని కోలార్ లో ఇటీవల జరిగిన ఘర్షణలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల దాడిలో పవన్ కల్యాణ్ అభిమాని హత్యకు గురయ్యాడు. దీనిపై పెను దుమారమే రేగింది. చనిపోయిన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ ఏకంగా తిరుపతి దాకా వెళ్లారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం ఓ ప్రైవేటు న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హద్దులు దాటే అభిమానులు తనకు వద్దని ఎన్టీఆర్ ఘాటుగా స్పందించాడు. సినీ హీరోలపై అభిమానం తప్పు కాదని చెప్పిన జూనియర్... ఆ అభిమానం హద్దులు దాటకూడదని చెప్పాడు. అభిమానం ఎల్లప్పుడూ పరిమితుల్లోనే ఉండాలని సూచించాడు. ముందు దేశం, తర్వాత కుటుుంబం... ఆ తర్వాతే సినీ హీరోలపై అభిమానం చూపాలని తేల్చి చెప్పాడు. సినీ హీరోలుగా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్... భవిష్యత్తులో కూడా ఉండబోవని కుండబద్దలు కొట్టాడు.