: ‘ప్రత్యేక హోదా’ జేఏసీకి మీరే సారథ్యం వహించండి!... పవన్ కల్యాణ్ ను కోరిన సి.రామచంద్రయ్య!
ఏపీకి ప్రత్యేక హోదాపై తిరుపతి వేదికగా గళం విప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ శాసనమండలిలో విపక్ష నేత సి.రామచంద్రయ్య స్వాగతించారు. తిరుపతిలో నిన్నటి పవన్ కల్యాణ్ ప్రసంగంపై ఆయన కొద్దిసేపటి క్రితం కడపలో స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్ కల్యాణ్ చేసే ఎలాంటి పోరాటానికైనా తాము మద్దతు తెలపనున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతున్న పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలన్నింటినీ ఒక్కదరికి చేర్చి ‘ఐక్య కార్యాచరణ కూటమి (జేఏసీ)’ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చిన రామచంద్రయ్య... దానికి పవన్ కల్యాణే సారథ్యం వహించాలని కోరారు. హోదా విషయంలో బీజేపీ తీరుపై విరుచుకుపడుతున్నంత స్థాయిలో టీడీపీపై పవన్ స్పందించలేదని రామచంద్రయ్య ఆరోపించారు. ఏదేమైనా ఇప్పటికైనా పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాపై నోరు విప్పడం స్వాగతించదగ్గదేనని ఆయన వ్యాఖ్యానించారు.