: సీఎం పవర్ స్టార్, జై పవనిజం!... తిరుపతి సభలో ఫ్యాన్స్ నినాదాలు పట్టించుకోని పవన్ కల్యాణ్!


తిరుపతిలోని ఇందిరా మైదానం వేదికగా నిన్న జనసేనాధిపతి పవన్ కల్యాణ్ నిర్వహించిన బహిరంగ సభలో ఆసక్తికర నినాదాలు వినిపించాయి. పవన్ కల్యాణ్ ను సీఎంగా అభివర్ణించిన ఆయన అభిమానులు పవనిజానికి జేజేలు పలికారు. అయితే ఈ నినాదాలు తన చెవిన పడ్డా కూడా పవన్ కల్యాణ్ సైలెంట్ గా వెళ్లిపోయారు. టాలీవుడ్ యంగ్ హీరో ఫ్యాన్స్ చేతితో చనిపోయిన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు తిరుపతి వెళ్లిన పవన్ కల్యాణ్... నిన్న తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు తిరుపతి నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి పవన్ అభిమానులు భారీగా తరలివచ్చారు. జనాన్ని చూసి రెట్టించిన ఉత్సాహంతో ఏపీకి ప్రత్యేక హోదాపై గళమెత్తిన పవన్ కల్యాణ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆ తర్వాత ఆయన వేదిక దిగుతున్న సమయంలో జనం నుంచి ‘సీఎం పవర్ స్టార్’, ‘జై పవనిజం’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు వినిపించాయి. అభిమానుల నుంచి వెల్లువలా వినిపించిన ఈ నినాదాలు విన్నా... పవన్ కల్యాణ్ సదరు నినాదాలను విననట్టే వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News