: పవన్ కల్యాణ్ పై విజయసాయిరెడ్డి ఫైర్!... బీజేపీపై చూపిస్తున్న దూకుడు టీడీపీపై లేదన్న వైసీపీ ఎంపీ!
తిరుపతి వేదికగా ఏపీకి ప్రత్యేక హోదాపై గళం విప్పిన టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నవ్యాంధ్రలో పెను రాజకీయ చర్చకే తెర లేపారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై పలు పార్టీలకు చెందిన నేతలు స్పందించారు. తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి కూడా స్పందించారు. కాసేపటి క్రితం హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన పవన్ కల్యాణ్ విశ్వసనీయతను ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ విశ్వసనీయతపై తమకు అనుమానాలున్నాయని సాయిరెడ్ది వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీపై చూపిస్తున్న దూకుడును పవన్ కల్యాణ్ టీడీపీపై ఎందుకు చూపడం లేదని ఆయన నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా అవినితికి పాల్పడినా... చంద్రబాబుపై పవన్ కల్యాణ్ ఆచితూచి మాట్లాడుతున్నారని ఆరోపించారు.