: బస్సు ప్రయాణంలో భార్య మృతి.. భర్తను, ఐదు రోజుల పసికందును వర్షంలో నడి రోడ్డుపై దించేసిన కండక్టర్!


గత వారం రోజులుగా దేశంలో జరగుతున్న వరుస సంఘటనలు మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. మనుషుల్లో ఏమూలైనా కాస్తంత ఉందనుకుంటున్న మానవత్వం నేతిబీర చందమేనని భావించాల్సిన పరిస్థితులు వెలుగుచూస్తున్నాయి. భార్య మృతదేహాన్ని తరలించేందుకు వాహనం ఏర్పాటు చేసేందుకు ఆస్పత్రి యాజమాన్యం నిరాకరించడంతో భార్య శవాన్ని మోస్తూ భర్త పది కిలోమీటర్లు నడిచిన వార్తను మరిచిపోకముందే, తల్లిశవాన్ని ముక్కలు చేసి మూటకట్టి తీసుకెళ్లిన ఘటన హృదయాలను ద్రవించి వేసింది. తాజాగా మధ్యప్రదేశ్‌లో అటువంటి సంఘటనే మరోటి జరిగింది. చత్తర్‌పూర్‌కు‌ చెందిన రామ్‌సింగ్ లోధీ(30), మల్లిబాయ్ భార్యభర్తలు. ఐదు రోజుల క్రితం మల్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అప్పటికే ఆమె ఆరోగ్యం సరిగా లేదు. గురువారం ఆమె మరింత అస్వస్థతకు లోనైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. రామ్‌సింగ్, అతడి భార్య మల్లి, తల్లి సునియాబాయ్‌తో కలిసి చత్తర్‌పూర్ నుంచి దామో‌కు ప్రైవేటు బస్సులో బయలుదేరారు. మార్గమధ్యంలో మల్లి ఆరోగ్యం విషమించడంతో బస్సులోనే ఆమె మృతి చెందింది. అప్పటికి బస్సు ఓ అడవి గుండా ప్రయాణిస్తోంది. భారీ వర్షం పడుతోంది. గమ్యం ఇంకా 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మల్లి చనిపోయిన వార్త విన్న బస్సు కండెక్టర్ తనలో మానవత్వం కాసింతైనా లేదని నిరూపించుకున్నాడు. బస్సును ఆపేసి వర్షంలోనే వారిని కిందికి తోసేశాడు. చంటి బిడ్డ, భార్య శవం, పక్కన రోదిస్తున్న తల్లితో అర గంటపాటు వారు వర్షంలో తడిసి ముద్దయ్యారు. అటుగా వెళ్తున్న ఇద్దరు లాయర్లు వీరిని చూసి సాయం అందించారు. బాధితుల గురించి పోలీసులకు సమాచారం అందిస్తే వారొచ్చి వివరాలు రాసుకుని వెళ్లిపోయారు తప్ప బాధితులకు ఎటువంటి సాయం అందించలేదని లాయర్లు ఆరోపించారు. విషయం కాస్తా మీడియాలో రావడంతో స్పందించిన పోలీసులు బస్సును సీజ్ చేసి డ్రైవర్, కండక్టర్‌ను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News