: భాగ్యనగరికి క్రికెట్ దేవుడు!... ‘ఒలింపిక్’ ప్లేయర్లకు బీఎండబ్ల్యూ కార్ల బహూకరణ!
జెంటిల్మన్ గేమ్ క్రికెట్ లో దేవుడిగా పిలుచుకుంటున్న మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ నేడు భాగ్యనగరి హైదరాబాదు రానున్నారు. ఇటీవల ముగిసిన రియో ఒలింపిక్స్ లో భారత్ సత్తా చాటిన ముగ్గురు మహిళా క్రీడాకారులు పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్, భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ లకు... క్రీడారంగ ప్రముఖుడు చాముండేశ్వరీనాథ్ బీఎండబ్ల్యూ కార్లను బహుమానంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్లను వారికి అందజేసేందుకే సచిన్ హైదరాబాదు వస్తున్నారు. నేటి ఉదయం 9 గంటలకు హైదరాబాదులోని పుల్లెల గోపీచంద్ అకాడెమీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ కార్లను సచిన్ ఒలింపిక్ క్రీడాకారులకు అందజేయనున్నారు.