: హైదరాబాదుకు పయనమైన ముద్రగడ!... దాసరి, చిరంజీవిలతో కీలక భేటీ!
కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేడు హైదరాబాదుకు రానున్నారు. ఆయన మూడు రోజుల పాటు హైదరాబాదులోనే మకాం వేయనున్నారు. కాపులకు రిజర్వేషన్ల కోసం ఉద్యమ బాట పట్టిన ముద్రగడ... కాపు గర్జన పేరిట తునిలో భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలో ముద్రగడ పిలుపు మేరకు కాపులు ధ్వంసరచనకు దిగారు. ఆ తర్వాత స్వీయ గృహ నిర్బంధం విధించుకున్న ఆయన పెను కలకలమే రేపారు. తాజాగా మరోమారు రంగంలోకి దిగిన ముద్రగడ... కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు టీడీపీకి గడువు విధించారు. ఆ గడువులోగా ఇచ్చిన హామీలు నెరవేర్చని పక్షంలో మరోమారు ఉద్యమ బాట చేపడతామని ఇటీవల ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే హైదరాబాదు రానున్న ముద్రగడ... తన సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు దాసరి నారాయణరావు, చిరంజీవిలతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత హైదరాబాదులోని కాపు ప్రముఖులను కూడా ఆయన కలవనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నేటి నుంచి హైదరాబాదులో ప్రారంభం కానున్న ముద్రగడ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.