: ఢిల్లీ విమానాశ్రయంలో ఫోన్లు మరిచిపోతున్న ప్రయాణికులు
ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారిలో చాలామంది ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లను మరిచిపోయి వెళ్లిపోతుంటారని సీఐఎస్ఎప్ అధికారులు తెలిపారు. మొబైల్ ఫోన్లు మాత్రమే కాకుండా, ల్యాప్ టాప్ లు, కెమెరాలు, జ్యుయలరీ, రిస్ట్ వాచ్, పాస్ పోర్టు, పాన్ కార్డు తదితరాలు మర్చిపోతుంటారని అన్నారు. ప్రధానంగా స్క్రీనింగ్, చెకింగ్ పాయింట్లు, వెయిటింగ్ ఏరియా, టాయిలెట్లు వంటి ప్రదేశాలలో ఈ సామగ్రి దొరుకుతుంటుందని వారు వెల్లడించారు. ఇలా ప్రయాణికులు మర్చిపోయిన సామాన్లను విమానాశ్రయ అథారిటీ వద్ద జమ చేస్తామని వారు తెలిపారు. గత ఏడాది 2148 మొబైళ్లను ప్రయాణికులు మర్చిపోగా, 1414 మొబైళ్లను వారి యజమానులు వచ్చి తీసుకెళ్లారని వారు వెల్లడించారు. అలాగే ఈఏడు తొలి ఐదు నెలల్లో 895 మొబైల్ ఫోన్లను ప్రయాణికులు మర్చిపోయారని, అందులో 317 ఫోన్లను తిరిగి వాటి యజమానులకు అప్పగించామని వారు చెప్పారు. ఇతర సామాన్లన్నీ కలుపుకుని ఈ ఐదు నెలల్లో ప్రయాణికులు వదిలి వెళ్లిన సామగ్రి విలువ సుమారు రెండు కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. అందులో 91 లక్షల రూపాయల విలువైన సామాగ్రిని వాటి యజమానులకు అప్పగించినట్టు వారు తెలిపారు. మిగిలిన సామానంతా విమానాశ్రయం స్టోర్ రూములలోనే ఉందని ఆయన చెప్పారు.