: మీరు స‌ర్దార్ సినిమాను స‌రిగ్గా చూడ‌లేదు.. నాకు డ‌బ్బులు రాలేదు!: ప‌వ‌న్ క‌ల్యాణ్‌


మూడు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ప్ర‌త్యేక హోదాకు అడ్డుప‌డుతున్నార‌ని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుగారు అంటున్నారని జ‌న‌సేన పార్టీ అధినేత, ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. మ‌రి ఆనాడు ఆరుకోట్ల మంది ప్ర‌జ‌లు విభ‌జ‌న‌కు అడ్డుపడలేదా? అని ఆయన ప్ర‌శ్నించారు. తిరుప‌తిలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఈరోజు ఆయ‌న మాట్లాడుతూ.. తుమ్మితే ఊడిపోయే పదవి కోసం ఏపీ నేత‌లు ఎందుకు ఆరాట‌ప‌డుతున్నారని అన్నారు. తనకు మోదీ అంటే గౌర‌వముందని, కానీ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టేంత అభిమానం లేదని పవన్ అన్నారు. ‘ఇక మీద‌ట సినిమాల‌తో పాటు రాజ‌కీయాల్లో ఉంటా.. డ‌బ్బులు సంపాదించాలి క‌దా!.. మీరు స‌ర్దార్ సినిమాను స‌రిగ్గా చూడ‌లేడు. నాకు డ‌బ్బులు రాలేదు.. సినిమాలు కూడా కొన‌సాగిస్తా. నా పోరాటం ప‌ద‌వి కోసం, రాజ‌కీయ లబ్ధి కోసం కాదు. సామాజిక మార్పు జ‌రిగితే చాలు. నా పోరాటానికి అధికార పార్టీ... ప్ర‌తిప‌క్ష పార్టీ అడ్డొస్తే వారితో విభేదిస్తా. సెప్టెంరులో 9న కాకినాడ‌లో మొద‌టి స‌భ పెడ‌తాను... హోదా సాధించే వ‌ర‌కు పోరాటాన్ని ఆప‌బోను. ఒకేసారి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయ‌బోను’ అని పవన్ అన్నారు. ‘ద‌శ‌లవారీగా వెళ‌తా.. హోదా సాధించే సందేశాన్ని ప్ర‌తి జిల్లాలోకి తీసుకెళ‌తా. ఢిల్లీలో హిందీలో మాట్లాడ‌తారు.. మ‌న‌వాళ్ల‌కి హిందీరాదు.. మ‌న ఎంపీలు హిందీ క్లాసెస్‌కు వెళ్లాలి. హిందీ నేర్చుకొని ఢిల్లీలో అడ‌గాలి. కేంద్రానికి చెప్ప‌ద‌లుచుకున్నది సూటిగా చెప్పాలి. సీమాంధ్ర ఎంపీలు ధ‌న‌వంతులు.. వారిని చూసి స్పెష‌ల్ స్టేష‌న్ ఇవ్వ‌బోమ‌ని చెప్ప‌కండి. ఆఖ‌రి మాట‌గా ఒకటే చెబుతున్నా పోరాడ‌దాం.. సాధించేవ‌ర‌కు పోరాడ‌దాం.. గెలిచేవ‌ర‌కు హోదా వ‌చ్చేవ‌ర‌కు పోరాడ‌దాం... క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామిని క‌లిసినప్పుడు న‌న్ను మీడియా మిత్రులు అడిగారు. అప్పుడన్నాను... హోదా సాధ‌న నా ఒక్కడివ‌ల్ల ఏమ‌వుద్ది అని. మీ అంద‌రూ క‌లిస్తే పోరాడ‌తా.. మీరు నా బ‌లం.. మ‌న జాతి ఆడ‌ప‌డుచులు నా బ‌లం’ అని పవన్ వ్యాఖ్యానించారు. ‘మీ బ‌లం చూసి నేను పోరాటానికి దిగుతా.. 70 కిలోల ఒక్క‌మ‌నిషిని ఏం చేస్తా? ఢిల్లీలో ఉన్న‌వారికి ఒక‌టే చెప్ప‌ద‌లచుకున్నా... మీరు మా కోపాన్ని, బాధ‌ని, చూడ‌లేక‌పోతున్నారు.. జ‌నసేన పార్టీ ఆంధ్ర‌ప్ర‌జ‌ల త‌ర‌ఫున ఉంది, పోరాడ‌తాం, మా హ‌క్కును సాధించుకుంటాం .. మేము పోరాడ‌తాం.. గెలిచేవ‌ర‌కు పోరాడ‌తాం.. ఇదే కేంద్రం ముందు ఉంచే అంశం. జైహింద్’ అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News