: 'నువ్వు గబ్బర్ సింగ్ కాదు.. రబ్బర్ సింగ్' అని కూడా అన్నారు: పవన్ కల్యాణ్
పెదవి దాటిన మాట మళ్లీ తీసుకోవడం కష్టమని జనసేన పార్టీ అధినేత, పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రం విడిపోయి సమస్యల్లో ఉన్నప్పుడు ఇరకాటం పెట్టే విమర్శలు చేస్తూ.. రాజకీయ లబ్ధి పొందే విమర్శలు చేస్తూ ఉండడం నాకిష్టం లేదు. నరేంద్రమోదీ పవన్ తో జనసేన పార్టీ పెట్టించారన్నారు. జనసేనాని తెలుగు దేశం తొత్తులాగ పనిచేస్తున్నారని అన్నారు. నువ్వు గబ్బర్ సింగ్ కాదు, రబ్బర్ సింగ్ అని కొందరు విమర్శలు గుప్పించారు’ అని పవన్ కల్యాణ్ అన్నారు. "నన్ను ఏమైనా అనండి, నేను సేవ చేయాల్సింది ప్రజలకి, రాష్ట్రానికి, దేశానికి" అని పవన్ కల్యాణ్ ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు. ‘నేను ఎక్కడికీ పారిపోను. నా రాష్ట్రం కోసం, దేశం కోసమే నా జీవితాన్ని అంకితం చేస్తాను. మాట ఇస్తే వెనక్కితగ్గను, మడమ తిప్పను. ప్రజాసేన భజన సేన అంటున్నారు. అవును భజన సేనే, ప్రజా సమస్యలపై భజన చేస్తా. నేను మోదీ భజన చేయలేదు. నేను మోదీ భజన చేశానని సీపీఐ నారాయణ అన్నారు. వామపక్ష పార్టీల పోరాటాలు అంటే నాకు గౌరవం. మా నాన్న ఓ క్రామేడ్ రాసిన పుస్తకాన్ని నాకిచ్చారు. దాన్ని చదివాను. చెగువేరా అంటే నాకు చాలా ఇష్టం. దేశం కోసమే నా పోరాటం’ అని పవన్ చెప్పుకొచ్చారు.