: హర్యానా అసెంబ్లీలో ప్రసంగించిన దిగంబర బాబా.. శ్రద్ధగా విన్న గవర్నర్, సీఎం, ఎమ్మెల్యేలు
హర్యానా అసెంబ్లీలో జైన దిగంబర బాబా తరుణ్ సాగర్ ప్రసంగించారు. నగ్నంగా అసెంబ్లీకి వచ్చిన ఆయన.. రాజకీయాల్లో ఎలా పాలన కొనసాగించాలో, ధర్మం మీదే దృష్టి ఉంచి ఎలా ముందుకు వెళ్లాలో చెప్పారు. ఆ రాష్ట్ర గవర్నర్, సీఎం, ఎమ్మెల్యేలు ఆ ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారు. ఆయన ప్రసంగం 40 నిమిషాలపాటు కొనసాగింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన ప్రసంగించారు. ధర్మం భర్త అయితే, రాజకీయం సతీమణిలాంటిదని ఆయన అన్నారు. సతీమణిపై భర్త నియంత్రణ ఎలా ఉంటుందో, అదే విధంగా రాజకీయాలపై ధర్మం నియంత్రణ ఉండాలని ఆయన బోధించారు. స్త్రీ భ్రూణ హత్యలపై తరుణ్ సాగర్ బాబా మాట్లాడుతూ వాటిని నిరోధించాల్సిన అవసరం ఉందని అన్నారు. దాయాది దేశం పాకిస్థాన్‌పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఒక బాబా దిగంబర అవతారంలో అసెంబ్లీలో ప్రసంగించడం ఇదే మొదటిసారి. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాంవిలాస్ శర్మ సూచనతో ఆయన 'కద్వే వచన్' పేరిట ఈ బోధ చేశారు.