: 'నేను 300 ఏళ్ల క్రితం రాజును...' అంటూ 47 కోట్లు కాజేశాడు!
'300 ఏళ్ల క్రితం రాజును, అమృతం తాగడం వల్ల ఇంకా బతికి ఉన్నాను' అంటూ ఎవరైనా చెబితే ఛ నిజమా? అంటాం... కానీ చైనాలో ఓ సంపన్నురాలు నిజమని నమ్మేసి 47 కోట్ల రూపాయలు మోసపోయిన ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే...గువాన్ డాంగ్ ప్రావిన్స్ కు చెందిన జెంగ్ షుజు అనే మహిళ 2012లో షెంజెన్ లో ఓ వ్యాపారం ప్రారంభించింది. తన కంపెనీలో పెట్టుబడులు పెట్టే వారిని ఆహ్వానించింది. దీంతో వాన్ జియాన్ మిన్ అనే వ్యక్తి ఆమెను కలిసి, తానో ఫైనాన్షియర్ నని ఆమె కంపెనీలో పెట్టుబడులు పెడతానని చెప్పాడు. ఆమెను బాగా పరిశీలించిన ఆయన తరువాత కొన్ని రోజులకు ఆమెకు ఒక వ్యక్తిని పరిచయం చేశాడు. తన పేరు క్వియన్ లాంగ్ అని 1735 నుంచి 1796 వరకు చైనాను పాలించిన రాజును తానేనని, అమృతం తాగడంతో తాను 300 ఏళ్లుగా బతుకుతున్నానని ఆమెకు చెప్పాడు. తన రాజప్రాసాదంలో భారీగా నిధులు ఉన్నాయని, వాటిని తీసుకొచ్చేందుకు సాయం చేయాలని ఆమెను కోరాడు. వారి మాటల గారడీలో పడిన ఆమె ఆ కథ వినడమే కాకుండా ఆ నిధులు తీసుకొచ్చేందుకు 2 మిలియన్ యువాన్లు కూడా ఇచ్చింది. ఆ తర్వాత 2014లో షెంజన్ లో ఓ టెక్నాలజీ సంస్థ పెట్టేందుకు వారికి 45 మిలియన్ యువాన్లు కూడా ఇచ్చింది. భారత కరెన్సీలో ఆమె ఇచ్చిన 47 మిలియన్ యువాన్ల విలువ సుమారు 47 కోట్ల రూపాయలు. ఇంత డబ్బు తీసుకున్న మోసగాళ్లు ఇంక అక్కడుండాల్సిన పనేముందని భావించి బిచాణా ఎత్తేశారు. ఆ తర్వాత తాను మోసపోయానని తెలుసుకుని, లబోదిబోమంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆమె వెర్రితననానికి నవ్వుకున్నా, ధనవంతురాలు కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఏడాది తరువాత ఆ ఇద్దరు మోసగాళ్లను అరెస్టు చేశారు.