: అత్యంత బాధాకరమైన ఫోటో... 62 ఏళ్ల కాపురం తరువాత ఏడుస్తూ దూరమైన వృద్ధ జంట!
తాను తీసిన అత్యంత బాధాకరమైన ఫోటో ఇదేనంటూ, ఆష్లే కాలియా అనే యువతి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఫోటో, ఆ ఫోటో వెనకున్న కథ నెటిజన్ల మనసులను కదిల్చివేస్తూ వైరల్ అవుతోంది. 62 సంవత్సరాల పాటు కాపురం చేసిన కెనడాకు చెందిన ఓ జంట విధిలేని పరిస్థితుల్లో ఒకరిని ఒకరు విడిచి గడపాల్సి వచ్చిన వేళ, ఆ వృద్థ జంట కన్నీటి పర్యంతమవుతుండగా తీసిన చిత్రమిది. మరిన్ని వివరాల్లోకి వెళితే, వోల్ఫార్మ్ గాట్స్ చాక్ (82), ఆయన భార్య యానీటా (81) జంట 1954లో జర్మనీలో తొలిసారిగా కలుసుకున్నారు. నాలుగు నెలల తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం పని వెతుక్కుంటూ ఈ దంపతులు కెనడాకు వచ్చి సెటిల్ అయ్యారు. గత 62 ఏళ్ల నుంచి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. 'నాకు నీవు ... నీకు నేను' అన్నంతగా అన్యోన్యంగా కాపురం సాగిస్తున్నారు. ఇలా జీవనం సాగిపోతుండగా వృద్ధాప్యం కారణంగా భర్తకు ఇటీవల మతిమరపు వ్యాధి వచ్చింది. దాంతో ఆయనను చికిత్స నిమిత్తం హెల్త్ కేర్ సెంటర్ లో జేర్చారు. అక్కడ అతనితో పాటు భార్య ఉండడానికి వీలులేకపోవడంతో భర్తను వదిలి ఆమె ఇంటివద్ద ఉంటోంది. అయినా ఆమె మనసంతా భర్తపైనే! వీరిద్దరూ వారానికి ఒకసారి కలిసే ఏర్పాటుండగా, కలిసిన ప్రతిసారీ భావోద్వేగానికి గురవుతూ బాధపడుతున్నారు. మతిమరపు వ్యాధి వల్ల భర్త తనను మరచిపోతాడేమో ఆమె భయపడుతోంది. కానీ అతను మాత్రం ఎవరిని మరచిపోయినా భార్యను మాత్రం మర్చిపోవడం లేదు. ఇదిలా ఉంచితే, గోరుచుట్టుపై రోకలిపోటు అన్నట్టుగా ఇప్పుడు భర్తకు కేన్సర్ అని కూడా తేలింది. ఇక ఆయన బతికేది రోజులే. అందుకే కనీసం వీరిద్దరూ తమ చివరి రోజులనైనా కలసి ఉండేలా చూసేందుకు చూస్తున్నామని, అందుకు తగ్గ సౌకర్యాలున్న కేర్ హోమ్ ను వెతుకుతున్నామని వారి మనవరాలు, ఈ ఫోటోను, వారి గాథను పంచుకున్న ఆష్లే కాలియా చెప్పింది. ఈ ఫోటోను, వారి గాథను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయగానే స్థానిక అధికారులు కూడా స్పందించారు. త్వరలోనే వీరిని కలిసి ఉంచేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.