: రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద మహిళలు కదలాల్సిన అవసరం ఉంది: రేవంత్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద మహిళలు కదలాల్సిన అవసరం ఉందని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన... అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మహిళలకు తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రాధాన్యతనిచ్చిందని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహిళలకు ఒక్క మంత్రిపదవి కూడా లేదని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ప్రజావ్యతిరేక విధానాలు చేపడుతోందని ఆయన ఆరోపించారు. ఆడబిడ్డలు పోరాడితేనే ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన చీఫ్ లిక్కర్ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమవుతుంటే తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు ఉద్యమించారని ఆయన అన్నారు. దాంతోనే కేసీఆర్ ప్రభుత్వం వెనకడుగు వేసిందని పేర్కొన్నారు. మహిళా ఉద్యమాలు ఈ మధ్య తగ్గాయని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై మరోసారి పోరాడాలని తమ మహిళా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.