: రూ. 20 లక్షల నుంచి రూ. 2 కోట్లకు జంప్ చేసిన సింధూ బ్రాండ్ వాల్యూ... క్యూ కడుతున్న కంపెనీలు
అతి త్వరలో టీవీల్లో ఫలానా సోప్ వాడాలనో లేకుంటే ఫలానా చాక్లెట్ తినాలనో పీవీ సింధు కనిపించి చెప్పే వ్యాపార ప్రకటనలు రానున్నాయి. ఒలింపిక్స్ పతకం సాధించిన తరువాత ఆమెకున్న బ్రాండ్ విలువ ఒక్కసారిగా పది రెట్లు పెరగగా, ఆమెతో డీల్స్ కుదుర్చుకుని తమ వ్యాపారాలు పెంచుకునేందుకు దిగ్గజ కంపెనీలు క్యూ కట్టాయి. ఆమె బ్రాండ్ వాల్యూ రూ. 20 లక్షల నుంచి ఏకంగా రూ. 2 కోట్లకు పెరిగింది. ఇక అతి త్వరలో తన తొలి కార్పొరేట్ భాగస్వామ్యాన్ని సింధు స్వయంగా వెల్లడిస్తుందని, ఆమె బ్రాండ్ మార్కెటింగ్ ను నిర్వహిస్తున్న బేస్ లైన్ వెంచర్స్ సహ వ్యవస్థాపకుడు ఆర్. రామకృష్ణన్ తెలిపారు. కొన్ని కంపెనీలతో డీల్స్ కుదిరాయని వాటి వివరాలు వచ్చే నెల రెండో వారంలో ప్రకటిస్తామని ఆయన వివరించారు. ఒలింపిక్స్ ముందు కూడా ఆమెకు బ్రాండ్ అంబాసడర్ ఆఫర్లు వచ్చినప్పటికీ, తాము ప్రమోట్ చేయాలని భావించలేదని అన్నారు. ఆమె సాధించిన పతకం శాశ్వతమైనది కాబట్టి, సింధూ విలువ మరింతగా పెరుగుతుందని బ్రాండ్ ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు.