: సింగపూర్‌కి మీరు చెబుతున్నంత గొప్ప చరిత్ర లేదు: ఏపీ ప్రభుత్వంపై ఉండవల్లి విమర్శలు
సింగపూర్ పేరును జపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నానా హంగామా చేస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఈరోజు హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్ కంపెనీలకు అన్ని బాధ్యతలు కట్టుబెట్టడం సరికాదని, ఆ దేశానికి అంత గొప్ప చరిత్రలేదని అన్నారు. ఎంతో చిన్న దేశమైన సింగపూర్‌తో స్విస్ ఛాలెంజ్ పధ్ధతి అంటూ ఒప్పందాలు చేసుకోవడం మంచిది కాదని ఆయన అన్నారు. రాజధానికి శంకుస్థాపన చేసి ఏడాది గడిచిపోయిందని మోదీ వచ్చి మట్టి, నీళ్లు ఇచ్చి శంకుస్థాపన చేశారని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణంపై హడావుడి తప్పా మెరుగైన పనితీరులేదని ఆరోపించారు. అమరావతి నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోందని ఉండవల్లి ఆరోపించారు. సింగపూర్‌గా మన రాష్ట్రాన్ని మార్చేస్తామని చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని ఆయన అన్నారు. సింగపూర్ కంపెనీలు అంత సమర్థమైనవేమీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసుకుంటోన్న ఒప్పందాలు సరైనవి కావని ఉండవల్లి అన్నారు. రాజధాని ఒకచోట, హైకోర్టు ఒకచోట కట్టాలని శివరామన్ కమిటీ సూచించిందని దాన్నిబట్టే చంద్రబాబు నడుచుకోవాలని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణం కోసం భారీ ఎత్తున భూసేకరణ చేస్తున్నారని, అంత భూమి అవసరం లేదని ఆయన అన్నారు.