: పవన్ కల్యాణ్ మా మిత్రుడు, ప్రత్యేక హోదా ఎవరు కోరినా మంచిదే: మంత్రి ప్రత్తిపాటి
జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ఈరోజు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తోన్న వేళ ఆ అంశంపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. అమరావతిలోని వెలగపూడిలో నిర్మించిన సచివాలయంలో వ్యవసాయశాఖ ఆఫీసుని ఆయన ఈరోజు ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ ని ప్రత్తిపాటి తమ పార్టీ మిత్రుడిగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాని పవన్ సహా ఎవరు కోరినా మంచిదేనని ఆయన అన్నారు. ఇక హోదా అంశంపై కేంద్రం ప్రతికూలంగా స్పందిస్తే కనుక సమయోచితంగా నిర్ణయం తీసుకొని ముందుకెళతామని ఆయన అన్నారు. హోదాపై అలుపెరుగని ఉద్యమం చేస్తామని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ అనుంబంధ రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం పాటుపడుతుందని ప్రత్తిపాటి అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయాభివృద్ధికి సమర్థంగా ఉపయోగించుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు కురవని ప్రాంతాల్లో 50శాతం రాయితీపై రెయిన్‌గన్‌లు పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై తిరుపతిలో వచ్చేనెల 11 నుంచి 15 వరకు సదస్సులు జరుగుతాయని ఆయన తెలిపారు.