: కలెక్టరుకు తుపాకి గురిపెట్టిన తమిళ మాజీ మంత్రి!
తన తుపాకి అనుమతులను పొడిగించాలని చేసుకున్న దరఖాస్తును ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తూ, డీఎంకే నుంచి తొలగించబడి ప్రస్తుతం డీఎండీకేలో కొనసాగుతున్న తమిళనాడు మాజీ మంత్రి ముల్లైవేందన్, సంచిలోంచి తుపాకిని తీసి కలెక్టర్ కు గురి పెట్టడంతో అధికారులు సహా అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ ఘటన ధర్మపురిలో జరిగింది. రైతుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన సభలో పాల్గొన్న ముల్లైవేందన్, హఠాత్తుగా తుపాకి తీసి కలెక్టర్ వివేకానందకు గురిపెట్టారు. ఆపై రెన్యువల్ దరఖాస్తుపై ప్రశ్నించారు. మంత్రి చర్యను తీవ్రంగా పరిగణించిన కలెక్టర్, వెంటనే దాన్ని లోపల పెట్టాలని ఆదేశించడంతో ఆయన తుపాకిని లోపల పెట్టారు. ఘటనపై కేసు నమోదైందా? లేదా? అన్నది తెలియరాలేదు.