: వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేయనున్న పవన్ కల్యాణ్?
పవన్ కల్యాణ్ తిరుపతిలో సభ నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం వెనుక భారీ వ్యూహమే ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. గతంలో సినీతారలు రాజకీయ రంగ ప్రవేశం చేసిన వేళ, తొలిసారి ఎన్నికల్లో పోటీ పడ్డప్పుడు తిరుపతినే ఎంచుకున్నారని, ఇప్పుడు పవన్ సైతం అదే దారిలో నడుస్తున్నారని జనసేన ప్రతినిధులు చెబుతున్నారు. గత రెండు రోజులుగా తిరుమలలో మకాం వేసిన పవన్, పలువురు సన్నిహితులు, తిరుపతిలోని తన అభిమాన సంఘాల నేతలను పిలిపించుకుని కీలక చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల జాబితాను తెప్పించుకున్న ఆయన, ఏ సామాజిక వర్గానికి ఎన్ని ఓట్లున్నాయన్న దగ్గర నుంచి యువత ఓట్లు, స్త్రీ, పురుషుల ఓట్లు, రాజకీయంగా బలంగా ఉన్న వర్గాలేంటి? ఎన్నికల్లో కులాల బలాబలాలు వంటి అంశాలన్నింటిపైనా సమగ్ర చర్చలు జరిపారు. దీంతో ఆయనకు దగ్గరగా ఉన్న నాయకుల్లో తమ నేత తిరుపతి నుంచి పోటీ చేస్తారేమోనన్న ఆశలు రేగుతున్నాయి. కాగా, గతంలో ఎన్టీఆర్, ఆపై చిరంజీవి వంటి వారు తిరుపతి నుంచి పార్టీని ప్రకటించి, పోటీ పడి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయాల్లోకి రావాలని పవన్ భావిస్తే, తిరుపతినే ఎంచుకోవచ్చన్న వాదనకు బలం చేకూరుతోందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.