: ఉజ్జయిని మహంకాళికి పీవీ సింధు మొక్కులు
రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ రజత పతక విజేత పీవీ సింధు కొద్దిసేపటి క్రితం పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది. చీరకట్టులో అచ్చమైన పదహారణాల తెలుగింటి అమ్మాయిలా ముస్తాబై తన తల్లితో కలసి ఆలయానికి వచ్చిన సింధు, తలపై పళ్లెంలో అమ్మవారికి పట్టుబట్టలను తీసుకువచ్చింది. ప్రతియేటా బోనాల సమయంలో అమ్మకు బోనం సమర్పించడం తనకు అలవాటని, ఈ సంవత్సరం ఒలింపిక్స్ కారణంగా రాలేకపోయానని వెల్లడించిన సింధు, భవిష్యత్తులోనూ తనను ఇలాగే కరుణించాలని కోరుకున్నట్టు తెలిపింది. ఆలయానికి వచ్చిన సింధుకు స్వాగతం పలికిన అధికారులు ఆమెతో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేశారు. సింధును చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు చేరడంతో, ఆ ప్రాంతం సందడిగా మారింది.