: ఒలింపిక్ కల.. పెళ్లి కోసం దాచిన డబ్బులతో కుమార్తెకు తుపాకి కొనిచ్చిన ఆటోడ్రైవర్!
షూటింగ్‌లో విశేష ప్రతిభ కనబరుస్తున్న కుమార్తెను చూసిన ఓ తండ్రి ఆమె పెళ్లి కోసం దాచిన రూ.5 లక్షలతో ఆమెకు తుపాకి కొనిచ్చాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన మనిలాల్ గోహిల్ ఆటో డ్రైవర్. కుమార్తె మిట్టల్(27) పెళ్లి కోసం పైసాపైసా కూడబెడుతూ రూ.5 లక్షలు పొదుపు చేశాడు. అయితే కుమార్తె షూటింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తుండడంతో ఆమె మరింత ఎత్తుకు ఎదిగి దేశానికి పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని భావించిన ఆయన కూడబెట్టిన రూ.5 లక్షలతో జర్మనీ రైఫిల్‌ను కొని ఆమెకు బహుమానంగా ఇచ్చాడు. నేషనల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన మిట్టల్‌కు చిన్నప్పటి నుంచి షూటింగ్‌పై ఆసక్తి ఉంది. చిన్నప్పుడు తాత ఉపయోగించే 12 బోర్ తుపాకి చూసినప్పటి నుంచి దీనిపై ఆసక్తి పెంచుకుంది. అయితే నాలుగేళ్ల క్రితం తండ్రి తనను రైఫిల్ క్లబ్‌కు తీసుకెళ్లాక ఆసక్తి మరింత పెరిగింది. ‘‘క్లబ్‌లో షూటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టా. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు’’ అని మిట్టల్ పేర్కొంది. క్రీడాకారిణిగా పేరు సంపాదించిన ఆమె పోటీల్లో పాల్గొనేందుకు నిన్నమొన్నటి వరకు ఇతర షూటర్లు అయిన బ్రహ్మ, లజ్జ గోస్వామి తదితరుల నుంచి తుపాకులు అద్దెకు తెచ్చుకునేది. 2013లో జరిగిన 57వ నేషనల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో అద్దె తుపాకితోనే పాల్గొని కాంస్య పతకం సాధించింది. దీంతో తన కుమార్తె ప్రతిభను తెలుసుకున్న తండ్రి గోహిల్ ఆమెకు తుపాకి కొనివ్వాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి కుమారుడు జైనిష్‌తో కలిసి డబ్బులు పొదుపు చేయడం ప్రారంభించాడు. ఇటీవల పోలీస్ కమిషనర్‌ను కలిసి లైసెన్స్ కోసం అభ్యర్థించాడు. కుమార్తె కోసం ఆయన పడుతున్న తపన చూసిన పోలీసు అధికారులు గోహిల్‌ను ప్రోత్సహించారు. చివరికి కూడబెట్టిన రూ.5 లక్షలతో 50 మీటర్ల సామర్థ్యం కలిగిన జర్మన్ రైఫిల్‌ను కొని కుమార్తెకు బహుమానంగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.