: 30 మంది ప్రాణాలు కాపాడి గుండెపోటుతో ప్రాణాలొదిలిన బస్ డ్రైవర్


గుండెపోటు బాధిస్తున్నా ప్రయాణికుల ప్రాణాలు తన చేతిలో ఉన్నాయని భావించిన ఓ బస్ డ్రైవర్ వారిని సురక్షితంగా బస్టాండ్‌కు చేర్చిన అనంతరం తాను మరణించిన విషాద ఘటన ఇది. పోలీసుల వివరాల ప్రకారం.. తమిళనాడులోని పెర్నాంబట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం మధ్య తిరిగే ప్రైవేటు బస్సు 30 మంది ప్రయాణికులతో గురువారం పెర్నాంబట్ నుంచి బయలుదేరింది. మార్గమధ్యంలో డ్రైవర్‌ వెంకటేశన్(41)‌కు గుండెల్లో బాధగా అనిపించింది. అయితే అది గుండెపోటు అని తెలుసుకోలేకపోయాడు. తనకు అనీజీగా ఉందని కండక్టరుతో చెప్పాడు. క్రమంగా గుండెల్లో బాధ ఎక్కువవుతుండడంతో బస్సును నెమ్మదిగా పోనిచ్చాడు. అలా చిత్తూరు జిల్లా వెంకటగిరిలోని కోట బస్టాండ్‌కు చేరుకుని బస్సును నిలిపివేశాడు. అప్పటికే బస్సు వేగం తగ్గిపోవడంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు డ్రైవర్‌పై విరుచుకుపడ్డారు. అయితే బస్సు దిగిన డ్రైవర్ ఓ టీస్టాల్ వద్దకు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయాడు. సమయం గడుస్తున్నా డ్రైవర్ కనిపించకపోవడంతో వెతికిన ప్రయాణికులు, కండక్టర్‌కు ఆయన గుండెపోటుతో కుప్పకూలిన విషయం తెలిసి వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అప్పటి వరకు డ్రైవర్‌ను నిందించిన వారు విషయం తెలిసి విషాదంలో మునిగిపోయారు. తమ ప్రాణాలు కాపాడేందుకే బస్సును నెమ్మదిగా నడిపి సురక్షితంగా బస్టాండ్‌కు చేర్చాడని తెలిసి కన్నీటి పర్యంతమయ్యారు.

  • Loading...

More Telugu News