: జకీర్ నాయక్‌కు మరో ఎదురుదెబ్బ.. ఉగ్రవాద కేసు పెట్టనున్న ప్రభుత్వం
వివాదాస్పద మతబోధకుడు జకీర్ నాయక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తన ప్రసంగాలతో యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షిస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్‌పై ఉగ్రవాదం కేసు నమోదు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే అతడు నడుపుతున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్(ఐఆర్ఎఫ్) సంస్థకు చట్టబద్ధత లేకపోవడంతో దానిని మూసివేయాలని నిర్ణయించింది. ఢాకాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న యువకులు తాము జకీర్ నాయక్ ప్రసంగాలతోనే స్ఫూర్తిపొందినట్టు చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే ఉగ్రవాద సంబంధ కేసులు ఎదుర్కొంటున్న మరో 50 మంది కూడా తమకు జకీర్ ప్రసంగాలు స్ఫూర్తినిచ్చినట్టు పేర్కొన్నారు. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తాయి. ఇక బంగ్లాదేశ్ అయితే జకీర్‌కు చెందిన ‘పీస్’ టీవీని నిషేధించింది. జకీర్ నాయక్ ప్రసంగాలపై దృష్టి సారించిన హోంమంత్రిత్వశాఖ చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద మహారాష్ట్రతో కలిసి రెండు వేర్వేరు కేసులు నమోదు చేయాలని భావిస్తోంది. కాగా ఢాకా పేలుళ్ల అనంతరం విదేశాలకు వెళ్లిన జకీర్ ఇప్పట్లో భారత్ వచ్చే సూచనలు కనిపించడం లేదు.