: ఏనుగులకు ఆధార్ కార్డు తరహా గుర్తింపు కార్డులు.. ఇప్పటికే 80 ఏనుగులకు జారీ చేసిన కర్ణాటక ప్రభుత్వం!
దేశంలో ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, ప్రభుత్వం అందించే ప్రయోజనాలు అందాలన్నా వాటికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని కేంద్రం సూచిస్తోన్న విషయం తెలిసిందే. దీని వల్ల అక్రమంగా ప్రభుత్వ ప్రయోజనాలను పొందేవారిని అరికట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఇదే రకమైన విధానాన్ని కర్ణాటక ప్రభుత్వం ఏనుగులకు కూడా ప్రవేశపెడుతోంది. ఏనుగులకు ఆధార్ కార్డ్ తరహా కార్డులు ఇచ్చి ఇతర రాష్ట్రాల నుంచి ఏనుగుల అక్రమ రవాణాను నిరోధించాలని చూస్తోంది. మరో రెండు నెలల్లో దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో ఉపయోగించే పెంపుడు ఏనుగుల సంఖ్యను పర్యవేక్షించడానికి వాటికి ఆధార్ కార్డ్ తరహా ఒక్కో నెంబరును ప్రభుత్వం ఇస్తోంది. దానికి సంబంధించిన ఒక మైక్రో చిప్ తయారుచేసి ఏనుగు చెవి వెనుక అమరుస్తారు. దీంతో వాటి దగ్గరికి వెళ్లి చిప్ రీడర్ సాయంతో ఏనుగుకి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. దీంతో ఇతర రాష్ట్రాలనుంచి అక్రమంగా చేసే ఏనుగుల రవాణాను నిరోధించవచ్చు. కర్ణాటకలో ఉన్న 400 ఏనుగులకు ఈ మైక్రోచిప్‌ను అమర్చనున్నారు. ప్రస్తుతం అధికారులు వాటికి సంబంధించిన పూర్తి సమాచారంతో మైక్రో చిప్స్ తయారుచేస్తున్నారు. ఇప్పటికే అధికారులు 80 ఏనుగులకు ఈ ప్రక్రియ ముగించారు. దీనికి సంబంధించి గత ఏడాది సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. కర్ణాటకలో వివిధ సంస్థల పర్యవేక్షణలో ఉన్న ఏనుగులను లెక్కించాలని, వాటిని రిజిస్టర్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. ఏనుగుల వివరాలపై నివేదిక రూపొందించి ఆయా జిల్లాల అధికారులకు ఇవ్వాలని చెప్పింది.