: కుక్కల్ని చంపడం సరికాదు: కేరళకు మేనక సూచన
కేరళలో గతవారం 65 ఏళ్ల మహిళను కొన్ని కుక్కలు అత్యంత దారుణంగా చీల్చిచంపినా ఘటనతో వీధికుక్కలను చంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి మేనకా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి శాస్త్రీయత, న్యాయం కనిపించడం లేదని ఆమె పేర్కొన్నారు. తాను కేరళ ప్రజల పక్షానే ఉంటాను కానీ, ఈ నిర్ణయం సరైన నిర్ణయం కాదని అన్నారు. వీధి కుక్కలను నియంత్రించేందుకు వాటిని చంపడం ఒక్కటే మార్గం కాదని ఆమె పేర్కొన్నారు. వ్యాక్సినేషన్, సంతానోత్పత్తి కలగకుండా చేయడం ద్వారా వాటిని కట్టడి చేయవచ్చని ఆమె తెలిపారు. వీధి కుక్కల స్టెరిలైజైషన్ కు ఇస్తున్న నిధులను ఏం చేశారని ఆమె కేరళ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఢిల్లీలో 5 లక్షల వీధికుక్కలు ఉండేవని, స్టెరిలైజేషన్ తరువాత వాటి సంఖ్య 70 వేలకు పడిపోయిందని ఆమె చెప్పారు. దీనికి కుక్కలను చంపడం పరిష్కారం కాదని, ఇతర ప్రాంతాల నుంచి కుక్కలు వచ్చే అవకాశం ఉందని, లేదా ఆ ప్రాంతంలోనే సంతానోత్పత్తి ద్వారా వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆమె తెలిపారు.