: ఎస్ఆర్ఎం యూనివర్శిటీ ఛాన్సలర్ అరెస్ట్ వెనుక ఏముంది?


చెన్నయ్ లోని ప్రముఖ విద్యాసంస్థ ఎస్ఆర్ఎం యూనివర్శిటీ ఛాన్సలర్ పచ్చముత్తును చెన్నై సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి విదితమే. తమ డీమ్డ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ విద్యలో సీట్ల ఆశ చూపి సుమారు వంద మందిని మోసం చేసిన ఘటనలో ప్రధాన నిందితుడి అదృశ్యం, మోసం తదతర ఆరోపణలపై మూడు కేసులు నమోదు చేసిన సీఐడీ అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే... చెన్నయ్ లోని మెడికల్, ఇంజనీరింగ్ విద్యాసంస్థలు నడుపుతున్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో వైద్య విద్య నభ్యసించాలని భావించే వారికి సీట్లు ఇప్పిస్తామని చెప్పి పచ్చముత్తుకు సన్నిహితుడైన సినీ నిర్మాత ఎస్.మదన్ సుమారు వంద మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బు వసూలు చేశాడు. ఇలా వారి నుంచి సుమారు 70 కోట్ల రూపాయలను ఆయన వసూలు చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. అనంతరం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైద్య కళాశాలలో సదరు విద్యార్థులకు సీట్లు కేటాయించకపోవడంతో పాటు, వసూలు చేసిన డబ్బుల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరగడంతో, గత మే నెలలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసిన మదన్, ఆ తరువాత కనిపించకుండా పోయారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఈ మెడికల్ కాలేజీ సీట్ల వ్యవహారం గురించి ప్రస్తావించారు. దీంతో మదన్ అదృశ్యం ఘటనలో పచ్చముత్తును అదుపులోకి తీసుకుని విచారించి, నిజాలు నిగ్గుతేల్చాలని న్యాయస్థానం ఆదేశించడంతో, ఆయనను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, విభజన అనంతరం విద్యావ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కోసం ఏపీ రాజధాని అమరావతిలో 200 ఎకరాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News