: సింధుకు మంచి కోచింగ్ ఇప్పిస్తామన్నానే తప్ప, గోపీచంద్ ను తొలగిస్తామనలేదు: డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
ప్రముఖ షట్లర్ సింధుకు కోచ్ గా ఉన్న గోపీచంద్ ను తొలగించి వేరే కోచ్ తో శిక్షణ ఇప్పిస్తానని తాను అన్నట్లుగా వస్తున్న వార్తలను తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఖండించారు. హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు మంచి కోచింగ్ ఇప్పిస్తామన్నానే తప్పా, ఆమె కోచ్ గా ఉన్న పుల్లెల గోపీచంద్ ను తొలగిస్తామని అనలేదని, తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తన వ్యాఖ్యలను మీడియా తప్పుదోవ పట్టించడం వల్లే ఈ గందరగోళం నెలకొందన్నారు. అవాస్తవాలను మీడియా ప్రచారం చేయకూడదని మహమూద్ అలీ హితవు పలికారు.