: రైలులోకి ప్రయాణికులను తోసేందుకు ప్రత్యేకంగా సిబ్బంది.. ‘ట్రెయిన్ పుషర్’లుగా పార్ట్‌టైం జాబ్ చేసుకుంటున్న విద్యార్థులు!
రైల్వేస్టేషన్‌లో రద్దీ ఎక్కువగా ఉంటే రైళ్ల ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణికులు వేలాడుతూ అలాగే ప్రయాణం చేస్తూ కనిపిస్తారు. ఈ క్రమంలో ప్రయాణికులు ఒకరినొకరు తోసుకోవడం.. ముందుకి జరుగు అని తోటి ప్రయాణికులతో గొడవ పడడం వంటివి చూస్తూనే ఉంటాం. ఫుట్‌బోర్డ్ మీద నిలబడి ప్రయాణం చేయడం ప్రమాదకరమని అధికారులు ఎంతచెప్పినా ప్రయాణికులు అస్సలు వినిపించుకోరు. వారి హడావుడి వారిది. అయితే ప్రయాణికులను రైలులోకే తోసే సిబ్బంది గురించి విన్నారా? జపాన్‌లో రైలు ప్రయాణికులను లోపలికి తోసేందుకు ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారట. జపాన్ రాజధాని టోక్యోలో పలు కంపెనీలకు వెళ్లే ఉద్యోగులు ఒకేసారి రైల్వే స్టేషన్‌కి వస్తుండడంతో అక్కడ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎన్ని రైళ్లను ఏర్పాటు చేసినా రద్దీ మాత్రం తగ్గడం లేదు. దీంతో కంపెనీల ప్రారంభవేళలయిన ఉదయం ఏడు నుంచి తొమ్మిది వరకు, మళ్లీ కంపెనీల ముగింపు వేళలయిన సాయంత్రం 7 నుంచి 9 గంటల మధ్య రైళ్లలో ఉద్యోగులు అష్టకష్టాలు పడి ప్రయాణిస్తుంటారు. రైలు ఎంతగా కిక్కిరిసిపోయి ఉన్నా ఆఫీసుకి సమయానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగులు ఫుట్‌బోర్డ్‌పై వేలాడుతుంటారు. దీంతో రైలు తలుపులు మూసుకోవడం లేదు. దీంతో ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందుకే ‘ట్రెయిన్ పుషర్’ అనే ఈ సిబ్బందిని అధికారులు ఆ పని కోసం దించారు. రైళ్లలోకి ప్రయాణికుల్ని తోసేయడం, రైలు తలుపులు మూసుకునేలా చేయడం.. తలుపులు మూయలేనంత ఎక్కువగా రద్దీ ఉంటే ప్రయాణికుల్ని బయటకి లాగి మరో బోగిలో లేదా మరో రైల్లోకి ఎక్కించడం వీరి పని. ‘ట్రెయిన్ పుషర్’ లుగా విద్యార్థులు కూడా పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నారట.