: పవన్ కల్యాణ్ తిరుపతి సభ కోసం అనుమతి కోరిన జనసేన.. అజెండాపై మరికాసేపట్లో ప్రకటన చేస్తామన్న పార్టీ కోశాధికారి
తిరుపతిలో సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. రేపు మధ్యాహ్నం తిరుపతిలో పవన్ బహిరంగ సభ నిర్వహిస్తాడనే వార్తలపై జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్య స్పందించారు. రేపు తిరుపతిలో తాము సభ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. అభిమానులకు, జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. పవన్ తిరుపతి సభ అజెండాపై పూర్తి వివరాలపై మరికాసేపట్లో ప్రకటన చేస్తామని పేర్కొన్నారు. తిరుపతిలోని ఇందిరా మైదానంలో కార్యకర్తలను ఉద్దేశించి పవన్ ప్రసంగించనున్నారు. సభ నిర్వహణ కోసం నగర పాలక సంస్థ, పోలీసుల అనుమతిని జనసేన కోరింది. రేపు మధ్యాహ్నం పవన్ బహిరంగ సభలో కీలక ప్రసంగం చేయనున్నారు. 2008 ఆగస్టు 26న పవన్ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని తిరుపతిలో ప్రకటించిన విషయం తెలిసిందే. సరిగ్గా ఎనిమిది సంవత్సరాల తరువాత ఈరోజు జనసేన సభ అంశంపై ప్రకటన రావడాన్ని అభిమానులు గొప్ప విశేషంగా అభివర్ణిస్తున్నారు.