: ‘అన్నయ్య’ బాటలోనే ‘తమ్ముడు’!... తిరుపతి నుంచి జనసేన ప్రస్థానానికి పవన్ కల్యాణ్ సన్నాహాలు?
టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి బాటలోనే పయనిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో అభిమానుల చేతిలో హత్యకు గురైన తన ఫ్యాన్ వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నిన్న తిరుపతి చేరుకున్న పవన్ కల్యాణ్... నేటి ఉదయం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడే తనకు కేటాయించిన గెస్ట్ హౌస్ కు చేరుకున్న ఆయన ఇప్పటిదాకా బయటికే రాలేదు. తనకు అత్యంత సన్నిహితులైన వారితో మాత్రం ఆయన సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే జనసేన పేరిట రాజకీయ పార్టీని ప్రకటించిన పవన్ కల్యాణ్... రేపు తిరుపతిలో పార్టీ పేరిటే భారీ బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పవన్ కల్యాణ్ నుంచి ఆదేశాలు అందుకున్న ఆయన ముఖ్య అనుచరులు బహిరంగ సభకు స్థల పరిశీలనకు రంగంలోకి దిగినట్లు సమాచారం. గతంలో 'ప్రజారాజ్యం' పేరిట రాజకీయ పార్టీని ప్రారంభించిన పవన్ కల్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి... తిరుపతిలోనే పార్టీ ప్రకటన చేశారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పలు పరిణామాల నేపథ్యంలో తన పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో కలిపేశారు. తాజాగా రేపు తిరుపతిలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభ ద్వారానే జనసేన ప్రస్థానాన్ని ప్రారంభించాలని పవన్ కల్యాణ్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే... టాలీవుడ్ లో ‘అన్నయ్య’ చిత్రంతో హిట్ కొట్టిన చిరంజీవి బాటలోనే ‘తమ్ముడు’తో ఆకట్టుకున్న పవన్ కల్యాణ్ పయనించినట్లవుతుందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.