: విమానాల్లో వైఫై అంటే తడిసి మోపెడే... ఇవ్వలేమంటున్న ఎయిర్ లైన్స్!


అన్ని విమానాల్లోను వైఫై సేవలను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా, విదేశాలకు వెళ్లే విమానాల్లో అయితే వైఫై సేవలకు సిద్ధమేగానీ, దేశవాళీ సర్వీసుల్లో మాత్రం అందించలేమని ఎయిర్ లైన్స్ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. విమానాలను వైఫై హాట్ స్పాట్ హబ్ లుగా మార్చాలంటే అందుకు ఎంతో వెచ్చించాల్సి వుంటుందని, ఇండియాలో సగటు విమాన ప్రయాణం రెండు గంటలు కూడా లేని వేళ వైర్ లెస్ సర్వీసులు అందించడం వ్యయ ప్రయాసలతో కూడుకున్నదేనని బడ్జెట్ ఎయిర్ సంస్థలు వాదిస్తున్నాయి. దేశంలో తిరిగే విమానాల్లో వైఫై ఏర్పాటు చేయడం అంత లాభదాయకం కాదని ఇండిగో సీనియర్ ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యానించారు. విమానాల్లో వైఫై చాలా ఖరీదుతో కూడుకున్నదని, ఆ భారం ప్రయాణికులపై మోపితే దాని ప్రభావంతో ఆక్యుపెన్సీ రేషియో సైతం తగ్గుతుందని స్పైస్ జెట్ ప్రతినిధి వెల్లడించారు. ఇదే విషయమై గో ఎయిర్ అధికార ప్రతినిధి స్పందిస్తూ, వైఫై పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందో లెక్కలేసిన మీదట స్పందిస్తామని అన్నారు. కాగా, జెట్ ఎయిర్ వేస్, విస్తారా కంపెనీలు మాత్రం వైఫై నిర్ణయాన్ని స్వాగతించాయి. అతి త్వరలోనే తమ విమానాల్లో వైఫై సేవలు అందుతాయని జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. తాము నడిపే బోయింగ్ 737 సర్వీసుల్లో ప్రయాణికుల చేతుల్లోని స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు వైఫై సాయంతో లైవ్ స్ట్రీమింగ్ కు సహకరిస్తాయని పేర్కొంది. ప్రభుత్వ విధానం అమల్లోకి వచ్చిన తరువాత తమ విమానాల్లో వైఫై రూటర్లను ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని విస్తారా సీఈఓ ఫీ తేక్ వెల్లడించారు. ఎంపిక చేసిన ఫ్లయిట్లలో మాత్రమే వైఫై సదుపాయాన్ని అందిస్తామని ఎయిర్ ఆసియా ఇప్పటికే ప్రకటించింది. ఎయిర్ ఇండియా మాత్రం ఖర్చు, ఆదాయ లెక్కలపై అవగాహనకు వచ్చిన తరువాతనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

  • Loading...

More Telugu News