: భార్య మృతదేహాన్ని 10 కిలోమీటర్లు మోసిన భర్త కేసులో ఆసుపత్రి తప్పేమీ లేదట... తేల్చిన ఒడిశా సర్కారు!
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన భార్య మరణిస్తే, శవాన్ని స్వగ్రామానికి తరలించేందుకు వాహనాన్ని కూడా ఆసుపత్రి సిబ్బంది అందించకుంటే, మృతదేహాన్ని భుజాన వేసుకుని పది కిలోమీటర్లు నడిచిన భర్త ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపించిన ఒడిశా సర్కారు, ఆసుపత్రి సిబ్బంది తప్పేమీ లేదని ప్రకటించింది. మృతురాలి భర్త దనా మాజీ హాస్పిటల్ లో ఎవరికీ చెప్పకుండానే మృతదేహాన్ని తీసుకు వెళ్లాడని భవానీపట్నా సబ్ కలెక్టర్ సుకాంత్ త్రిపాఠీ నేతృత్వంలోని విచారణ బృందం వైద్యులకు, సిబ్బందికీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆసుపత్రికి పది కిలోమీటర్ల దూరానికి వెళ్లిన తరువాత, విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న కలెక్టర్, డెడ్ బాడీని తరలించేందుకు వాహనాన్ని ఏర్పాటు చేయించిన సంగతి తెలిసిందే. ఇంకాసేపు ఆసుపత్రి వద్దనే ఉంటే అంత్యక్రియలు ఆలస్యం అవుతాయన్న ఉద్దేశంతో తాను భార్య మృతదేహంతో బయలుదేరినట్టు దనా మాజీ తెలిపాడని అధికారులు వెల్లడించారు.