: నయీమ్ ‘సిట్’ ఆఫీస్ కు పోలీస్ స్టేషన్ హోదా!
గ్యాంగ్ స్టర్ నయీమ్ వ్యవహారాల గుట్టు విప్పేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) త్వరలోనే ఓ కార్యాలయం, ఆ కార్యాలయానికి పోలీస్ స్టేషన్ హోదా లభించనున్నాయి. ప్రాణభయంతో నయీమ్ దందాకు లొంగిపోయిన చాలా మంది వ్యాపారులు, రాజకీయవేత్తలు, రైతులు... నిన్నటిదాకా నోరు మెదిపేందుకు భయపడ్డారు. అయితే పాలమూరు జిల్లా షాద్ నగర్ లో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో హతం కావడం, అతడి అక్రమాల గుట్టును విప్పేందుకు తెలంగాణ సర్కారు సిట్ ను ఏర్పాటు చేయడంతో బాధితుల్లో కాస్తంత ధైర్యం వచ్చింది. ఇప్పటికే సిట్ చీఫ్ నాగిరెడ్డికి నేరుగా ఫోన్ చేసిన కొందరు బాధితులు నయీమ్ తమను ఏ విధంగా వేధించాడో చెప్పుకుని బోరుమన్నారు. ఈ క్రమంలో రోజుకు కొంతమంది చొప్పున బాధితులు బయటకు వస్తున్నారు. నయీమ్ దందాపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రత్యేకంగా కార్యాలయం లేక ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతుండగా వాటిని సిట్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇక అరెస్టు విషయంలోనూ సిట్ అధికారులు పర్యవేక్షణకే పరిమితం కావాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలు నిన్న పోలీసు ఉన్నతాధికారులతో జరిపిన సమీక్ష సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్ హోదా లేని కారణంగా సిట్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న పోలీసు బాసులు... దానికి పోలీస్ స్టేషన్ హోదా ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దీనికి ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. త్వరలోనే సిట్ కు ఓ కార్యాలయాన్ని కేటాయించి, దానికి పోలీస్ స్టేషన్ హోదా కల్పించే విషయంలో చర్యలు వేగవంతమైనట్లు సమాచారం. ఇదే జరిగితే... నయీమ్ బాధితుల నుంచి సదరు స్టేషన్ కు ఫిర్యాదులు మరింతగా వెల్లువెత్తే అవకాశాలున్నాయి.