: నిధులు నిండుకున్నాయ్!.. సంక్షేమ పథకాలకు డబ్బుల్లేవంటున్న తెలంగాణ ప్రభుత్వం
సంక్షేమ పథకాల కంటే ప్రాజెక్టులకే ఎక్కువ నిధులు ఖర్చు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అనుకున్నంత బాగా లేకపోవడంతో సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై ఆంక్షలు జారీ చేసింది. అక్టోబరు వరకు అన్ని చెల్లింపులను నిలిపివేయాలని వివిధ శాఖలను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, పింఛన్లు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఆగిపోనున్నాయి. ఫలితంగా లక్షలాదిమంది విద్యార్థులు, పింఛన్‌దార్లు, ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది. 2016-17 సంవత్సరానికి గాను ప్రభుత్వం రూ.1.33 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రణాళిక వ్యయం కింద రూ.72,195 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.61,622 కోట్లు కేటాయించారు. ఇది జరిగి ఐదు నెలలైనా కాకముందే సంక్షేమ పథకాలకు డబ్బులు లేవని ప్రభుత్వం చేతులెత్తేయడం గమనార్హం. ఏప్రిల్-ఆగస్టు మధ్య వివిధ పథకాలకు ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల వివరాలు ఇలా.. ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.10 వేల కోట్లు వాటర్ గ్రిడ్‌కు రూ.3 వేల కోట్లు వేతనాలకు రూ.8 వేల కోట్లు పంట రుణాల మాఫీకి రూ.2 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.1,200 కోట్లు