: కొడుకు తేజస్వి యూరప్ టూరులో ఉంటే... మంత్రిగా బాధ్యతల్లో లాలూ ప్రసాద్ యాదవ్!
బీహార్ ను వరదలు అతలాకుతలం చేస్తుంటే, తన కుమారుడు, రాష్ట్ర మంత్రి తేజస్వీ యాదవ్ అధికారిక పర్యటన నిమిత్తం యూరప్ లో ఉండగా, ఆయన బాధ్యతలను ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేపట్టారు. తేజస్వీ విజయం సాధించిన రాఘోపూర్ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టిని సారించిన ఆయన, వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ, ప్రజలకు అందాల్సిన సాయంపై అధికారులకు సూచనలు ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. రాఘోపూర్ తో పాటు దనాపూర్, మనేర్ నియోజకవర్గాల్లోనూ పర్యటించిన ఆయన వరద సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రాంతాలన్నీ పాటలీపుత్ర పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉండటం గమనార్హం. ఇక్కడి నుంచి లాలూకు నమ్మినబంటుగా ఉన్న రాం క్రిపాల్ యాదవ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆపై ఆయన లాలూకు దూరం కాగా, తదుపరి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా లాలూ పాటలీపుత్ర పరిధిలోని వరద ప్రాంతాలపై కన్నేసినట్టు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించాయి.