: కాబూల్‌లోని అమెరికా యూనివర్సిటీపై దాడి పాక్ పనే: ఆఫ్గాన్
ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ మధ్య వాతావరణం వేడెక్కుతోంది. కాబూల్‌లోని అమెరికన్ యూనివర్సిటీపై దాడి మూలాలు పాకిస్థాన్‌లో ఉన్నాయని ఆఫ్గనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఆరోపించారు. ఈ దాడి వ్యూహరచన మొత్తం పాకిస్థాన్‌లో రూపొందిందని పాకిస్థాన్ ఆర్మీచీఫ్ రషీల్ షరీఫ్‌తో ఘనీ పేర్కొన్నారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆఫ్గాన్‌కు భారత్ సాయం అందించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న పాకిస్థాన్.. ఇప్పుడు ఆ దేశం చేస్తున్న ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఉగ్రవాదంపై పోరుకు ఆఫ్గనిస్థాన్‌కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని భారత్ పేర్కొనడంతో ఇప్పటికే పాక్ వెన్నులో వణుకు మొదలైన సంగతి తెలిసిందే. ఆఫ్గాన్-పాక్ బంధం తమకు నష్టం కలిగించకూడదని పాక్ గురువారం పేర్కొన్న విషయం విదితమే.