: డబుల్స్ మ్యాచ్ కోసం జత కట్టిన ఫెదరర్, నాదల్
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్... సమకాలీన టెన్నిస్ ప్రపంచంలో వీరిద్దరి పేర్లూ తెలియని వారుండరు. మైదానంలో వీరిద్దరూ తలపడితే, కళ్లు అప్పగించి ఆటకు అంకితమై పోవాల్సిందే. అటువంటి ఎన్నో ఉత్కంఠ పోటీలు ఇద్దరి మధ్యా జరిగాయి. ఇప్పుడు కథ మారింది. యూరప్ తరఫున డబుల్స్ మ్యాచ్ ఆడేందుకు ఇద్దరూ ఓ వైపు నిలిచి తమ రాకెట్లతో ప్రత్యర్థులను అదర గొట్టేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ లో యూరప్, రెస్టాఫ్ ది వరల్డ్ జట్ల మధ్య జరగనున్న లావెర్ కప్ టెన్నిస్ పోటీల్లో యూరప్ తరఫున వీరిద్దరూ ఓ జట్టుగా ఆడనున్నారు. ఇదే సమయంలో యూరప్ తరఫున మరో జంటగా, వరల్డ్ నంబర్ వన్ జకోవిచ్, బ్రిటన్ స్టార్ ఆటగాడు ఆండీ ముర్రేలను కూడా బరిలోకి దించాలని టోర్నీ నిర్వాహకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీరు నలుగురూ యూరప్ తరఫున బరిలో ఉంటే మిగతా జట్లన్నింటికీ గెలుపు అవకాశాలపై ఆందోళన పెరుగుతుందనడంలో సందేహం లేదు.