: అభిమాని పోస్ట్ చేసిన వీడియోను చూసి ముగ్ధుడైన రజనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలవాలని, ఆయనతో ఒక ఫొటో దిగాలని కలలు గనే అభిమానులకు లెక్కలేదు. అలాంటిది, రజనీకాంతే తన అభిమానిని స్వయంగా ఆహ్వానిస్తే.. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఆ వివరాల్లోకి వెళితే, ఇటీవల విడుదలైన ‘కబాలి’ సినిమాలోని డైలాగ్ లను రజనీ అభిమానులు చెబుతూ తీసిన వీడియోలను ఆయన ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. కబాలి సినిమాలో ఎంతో ఫేమస్ అయిన ‘కబాలి రా’ డైలాగ్ ను కొద్దిగా మార్చి.. ఆ డైలాగ్ ను రజనీని అభిమానించే ఒక మహిళ చెప్పింది. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. తాను స్వతంత్రంగా జీవించే మోడ్రన్ గృహిణినంటూ ఆ మహిళ చెప్పిన డైలాగ్ రజనీ డైలాగ్ చెప్పే స్టైల్ లో ఉంది. ఈ వీడియోను చూసిన రజనీకాంత్ ఎంతో ముగ్ధుడైపోయి, వెంటనే ఆమె వివరాలు తెలుసుకున్న రజనీ కాంత్, ఆమెను తన ఫామ్ హౌస్ కు ఆహ్వానించి మరీ అభినందించారు.