: పవన్ కల్యాణ్ అభిమాని హత్య కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ అభిమాని వినోద్ రాయల్ హత్యకు గురైన కేసులో ప్రధాన నిందితుడు అక్షయ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలోని నందిని దాబా వద్ద అతన్ని పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. అక్షయ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పవన్ అభిమాని హత్య కేసులో మొత్తం ఏడుగురు పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 21న కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో వినోద్ రాయల్ కత్తిపోట్లకు గురై చనిపోయాడు. కాగా, తిరుపతిలోని వినోద్ కుటుంబసభ్యులను జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఈరోజు పరామర్శించారు.