: భారత్ లో మూడేళ్లలో మూడొందల శాతం పెరిగిన సైబర్ నేరాలు


గడచిన మూడేళ్లలో భారత్ లో సైబర్ నేరాల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగిపోయినట్లు ఒక అధ్యయనం ద్వారా తెలుస్తోంది. సైబర్ నేరాలు ముఖ్యంగా అమెరికా, టర్కీ, చైనా, బ్రెజిల్, పాకిస్థాన్, అల్జీరియా, యూరోప్, యూఏఈ దేశాల్లో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల వినియోగం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కారణంగా, సైబర్ నేరగాళ్లు భారత్ ను లక్ష్యంగా చేసుకోవడంతో నేరాల శాతం ఆశ్చర్యం కల్పించే స్థాయిలో పెరిగిపోయింది. 2011-2014 సంవత్సరాలలో 'ఐటీ యాక్టు, 2000' కింద మనదేశంలో సైబర్ నేరాలు సుమారు 300 శాతం పెరిగినట్లు అసోచామ్- పీడబ్ల్యుసీ సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. న్యూక్లియర్ ప్లాంట్స్, రైల్వేస్, రవాణా వ్యవస్థ, ఆసుపత్రులు వంటి కీలక వ్యవస్థలపై సైబర్ ఎటాకర్స్ పట్టు సాధించడం ద్వారా పవర్ ఫెయిల్యూర్, వాటర్ పొల్యూషన్, వరదలు, రవాణా వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం, ప్రాణ నష్టం వంటి ఊహించని సంఘటనలు జరుగుతుంటాయని ఆ అధ్యయనం ద్వారా తెలిసింది. ఒక్క అమెరికాలోనే 2012-2015 సంవత్సరాల్లో సుమారు 50 శాతం వరకు సైబర్ నేరాలు పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ దాడులు చాలా తరచుగా, తీవ్రంగా జరుగుతున్నాయని, ఈ సమస్య వ్యక్తిగతమే కాకుండా, ప్రభుత్వ, వ్యాపార సంస్థలు కూడా వారి లక్ష్యంగా ఉన్నాయని అధ్యయనంలో తేలింది. సైబర్ దాడులకు పాల్పడే వారు తమ పద్ధతులను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారనే విషయాన్ని ఈ అధ్యయనం ప్రధానంగా పేర్కొంది. సైబర్ నేరాలకు గురికాకుండా ఉండాలంటే, సైబర్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ పై దృష్టి పెట్టడం, ముందుచూపుతో వ్యవహరించడమనేది చాలా అవసరమని అసోచామ్-పీడబ్ల్యుసీ సంయుక్త అధ్యయనంలో పేర్కొంది.

  • Loading...

More Telugu News