: ఈ అలారం ఉపయోగిస్తే ఎంతటి బద్ధకస్తులైనా నిద్ర లేవాల్సిందే!
ఉదయాన్నే నిద్రలేచి చదువుకోవాలని లేదా వాకింగ్‌కి వెళ్లాలని అలారం పెట్టుకుంటాం. అలారం తన పని తాను చేస్తూ మోగుతున్నా మంచంపై నుంచి లేవడానికి ఎంతో బద్ధకిస్తాం. వెంటనే అలారం స్టాప్ బటన్ నొక్కేసి మరో పది నిమిషాలు పడుకుందాంలే అనుకుంటాం. తీరా కళ్లు తెరచిచూస్తే ఎంతో ఆలస్యంగా నిద్రలేచామని తెలుస్తుంది. ఇలాంటి చిక్కులను దూరం చేయడానికే జపాన్‌లో వినూత్న అలారం ఆవిష్కరించారు. దీనికి ‘జిక్కా అలారం’ అని పేరుపెట్టారు. జిక్కా అంటే జపాన్ భాషలో ఇల్లు అని అర్థం. ఇంట్లో మనకు వినిపించే పలు రకాల చప్పుళ్లతో మన నిద్రమత్తు వదులుతుందని తెలుసుకున్న జపాన్ వారు ఈ అలారం ద్వారా అటువంటి చప్పుళ్లనే వినిపించాలని దీన్ని రూపొందించారు. నిద్రలో ఉన్న వారికి వంట గది నుంచి వచ్చే వాసనలు, కత్తిపీట శబ్దాలు వినిపిస్తే నిద్రమత్తు వదులుతుందట. దీంతో అలాంటి చప్పుడు, వాసననే తలపించే అలారం తయారు చేసింది. మామూలుగా మనం ఉపయోగించే అలారం గడియారాలలాగే జిక్ అలారం సెట్ కూడా చేసుకున్న సమయానికి మోగుతుంది. అయితే దాని చప్పుడు మాత్రం కత్తిపీట టకటకామని ఎలాంటి శబ్దం చేస్తుందో అలాంటి శబ్దంతో వస్తుంది. అంతేకాదు, బ్రేక్‌ఫాస్ట్ చేసే వాసనల్ని కూడా అందించడం జిక్కా అలారం స్పెషాలిటీ. దీని దెబ్బకు ఇక నిద్రమత్తు వదిలేలా చేసి ఉదయాన్నే మనల్ని నిద్రలేచేలా చేస్తుంది. జిక్కా అలారంలో రెండు రకాలైన మోడ్‌లను ఏర్పాటు చేశారు. ఒకటి మామ్ మోడ్ అయితే రెండోది న్యూలీ మ్యారీడ్ మోడ్. మొదటి మోడ్ పెడితే అమ్మ వంట చేస్తే వచ్చే శబ్దంలా అలారం మోగుతుంది. రెండో మోడ్ కొత్తగా పెళ్లైన వారు వంట చేస్తే ఎలా ఉంటుందో అలా మోగుతుంది. ఈ అలారాన్ని స్మార్ట్ ఫోను ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. త్వరలోనే ఇది మార్కెట్లోకి రానుంది.