: వెంటనే వడ్డీ రేట్లు తగ్గాల్సిందే: నిర్మలా సీతారామన్


ఇండియాలో వడ్డీ రేట్లు రెండు శాతం వరకూ తగ్గి, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సులభ రుణాలు లభించాల్సి వుందని కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. రెపో రేటు 200 బేసిస్ పాయింట్లు తగ్గితేనే, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు లబ్ధి కలుగుతుందని వివరించారు. ప్రస్తుతం ఇండియాలో వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయని, దీనివల్ల ఎగుమతులు తగ్గి ఉద్యోగాల్లో కోత కనిపిస్తోందని, నిధుల సమీకరణ కష్టసాధ్యమైందని ఆమె అన్నారు. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తెచ్చుకునే డబ్బుకు చెల్లించే వడ్డీ రేటు (రేపో రేటు) తగ్గిస్తే, దాని ప్రభావంతో కంపెనీలకు మేలు కలుగుతుందని వివరించారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి రెపో రేటు 6.5 శాతం వద్దనే స్థిరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలి తన చివరి పరపతి సమీక్ష నిర్వహించిన ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వడ్డీ రేట్లను మార్చే సాహసం చేయలేదు. ఇక తదుపరి అక్టోబర్ 4న కొత్త విధానంలో ఆర్బీఐ పరపతి సమీక్ష జరగనుంది. కొత్త గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ సమీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, వడ్డీ రేట్లు తగ్గాల్సిన అవసరాన్ని తాను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకువెళతానని, బ్యాంకులు సైతం పరిస్థితులను గమనించాలని నిర్మలా సీతారామన్ కోరారు. ఎగుమతిదారులకు ఇస్తున్న వడ్డీ రాయితీ పథకాలు కూడా సరిపోవడం లేదని అభిప్రాయపడ్డ ఆమె, ఎంఎస్ఎంఈలకు ఆర్థికంగా చేదోడుగా నిలిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని వివరించారు.

  • Loading...

More Telugu News