: చివరి రెండు గంటల్లో అమ్మకాల వెల్లువతో నష్టాల్లోకి మార్కెట్


సెషన్ ఆరంభం నుంచి క్రితం ముగింపుతో పోలిస్తే 50 నుంచి 100 పాయింట్ల లాభాల్లో సాగిన బెంచ్ మార్క్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం ఒకటిన్నర తరువాత యూరప్ మార్కెట్ల ప్రభావంతో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనైంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, దేశవాళీ ఫండ్ సంస్థలు భారీగా విక్రయాలకు పాల్పడటంతో మరేదశలోనూ సూచికలు కోలుకోలేదు. సెన్సెక్స్ 220 పాయింట్లకు పైగా పడిపోయింది. బలహీనంగా ఉన్న ఆసియా మార్కెట్లు, ద్రవ్యోల్బణం పెరగవచ్చన్న సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయని మార్కెట్ పండితులు వ్యాఖ్యానించారు. గురువారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 224.03 పాయింట్లు పడిపోయి 0.80 శాతం నష్టంతో 27,835.91 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 58.10 పాయింట్లు పడిపోయి 0.67 శాతం నష్టంతో 8,592.20 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.35 శాతం, స్మాల్ కాప్ 0.11 శాతం నష్టపోయాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 15 కంపెనీలు లాభపడ్డాయి. బీహెచ్ఈఎల్, బీపీసీఎల్, గెయిల్, ఐటీసీ, హెచ్సీఎల్ టెక్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, విప్రో, అదానీ పోర్ట్స్, ఐడియా, జడ్ఈఈఎల్, టెక్ మహీంద్రా తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,886 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,245 కంపెనీలు లాభాలను, 1,456 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,09,26,060 కోట్లుగా నమోదైంది.

  • Loading...

More Telugu News