: తక్కువ తినడానికి అలవాటు పడ్డ గ్రామీణ ప్రజలు: ఎన్ఎన్ఎంబీ సర్వే


భారతావనికి స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటి, అన్ని రంగాల్లో దూసుకుపోతున్న వేళ, గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న 83.3 కోట్ల మంది (70 శాతం) ప్రజలు తక్కువగా తినడానికి అలవాటు పడ్డారని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ 'నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ బ్యూరో' (ఎన్ఎన్ఎంబీ) తన తాజా సర్వేలో వెల్లడించింది. ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాహారాలను వీరు తీసుకోవడం లేదని తెలిపింది. 1975-79 మధ్య కాలంతో పోలిస్తే గ్రామీణ ప్రాంత ప్రజలు ఇప్పుడు 550 కేలరీల తక్కువ ఆహారాన్ని తీసుకుంటున్నారని ఎన్ఎన్ఎంబీ పేర్కొంది. 40 ఏళ్ల క్రితం పరిస్థితులతో పోలిస్తే, 13 గ్రాముల ప్రొటీన్, 5 ఎంజీ ఐరన్, 250 ఎంజీ కాల్షియం, 500 ఎంజీ విటమిన్ ఏ తక్కువగా వారికి అందుతోందని, దీంతో ఆరోగ్యానికి సరిపడినంత పోషకాలు అందడం లేదని తెలిపింది. నాలుగు దశాబ్దాల క్రితం గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులు రోజుకు 300 ఎంఎల్ పాలను సరాసరిన తాగితే, నేడది 80 ఎంఎల్ కు పడిపోయిందని, 35 శాతం మంది స్త్రీ పురుషులు పోషకాల లేమితో ఉండగా, 42 శాతం మంది చిన్నారులు తక్కువ బరువును కలిగివున్నారని సర్వే నిర్వహించిన అజీవికా బ్యూరో సంస్థ వెల్లడించింది. మరీ మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉందని పేర్కొంది. తాము సర్వే చేసిన వాళ్లలో సగం మంది తల్లులు ముందురోజున పప్పు తినలేదని, మూడింట ఒక వంతు మంది ఎలాంటి కూరగాయలూ తీసుకోలేదని, దాదాపు అందరూ పండ్లు, మాంసం, గుడ్లు తదితరాలకు దూరంగా ఉన్నారని వెల్లడించింది. ఈ ఫలితాలు భవిష్యత్తులో ప్రధాని మోదీ కలలైన మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా కార్యక్రమాలకు, భవిష్యత్ ఆర్థిక వృద్ధిని అడ్డుకునేవేనని ఎన్ఎన్ఎంబీ తెలియజేసింది. కాగా, 1972లో దేశంలోని 10 రాష్ట్రాల్లో సేవలను ఆరంభించిన ఎన్ఎన్ఎంబీ, ఇప్పటివరకూ పలుమార్లు ఇదే తరహా సర్వేలను నిర్వహించింది.

  • Loading...

More Telugu News